ప్రాచీన యుగాల్లో శ్రమ విభజన
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మానవ సమాజం శ్రమ మీదనే పూర్తిగా ఆధారపడుతుంది. శరీరశ్రమ లేకుండా మనుషులకు ఎన్నడూ జరగలేదు. గుహల్లో జీవించిన దశాలోనైనా, గ్రామాలూ, పట్టణాల్లో కాలం గడిపినప్పుడైనా ప్రజలు ప్రతిదానికీ ఒళ్ళు వంచి కష్టపడుతూనే ఉన్నారు. శ్రమ లేకుండా వినియోగానికి వస్తువులూ, సంపదలూ ఏనాడూ సృష్టి కాలేదు. అయతే సమాజంలో అందరూ ఒకే రకంగా పనిచెయ్యరు. ఎక్కువమంది చెమటోడ్చినా కొందరు "బుద్ధిబలాన్ని" మాత్రమే ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో "చదువుకున్నవారు" తగిన అవకాశాలు దొరక్క శరీరశ్రమ చెయ్యడానికి సిద్ధపడితే అది వారికీ, ఇతరులకూ కూడా అవమానకరంగా అనిపిస్తుంది.
ఈ ఎక్కువ తక్కువలు మొదలై కొన్ని వేల సంవత్సరాలయంది. ఇది "అనాది"గా మాత్రం ప్రారంభమైన భావన కాదు. ఎందుకంటే తొట్టతొలి మానవ సముదాయాల్లో శ్రమ విభజన అంటూ ఉండేది కాదు. అందరూ కలిసి కష్టించేవారు. వేటలోనైనా, ఏరుకు తినడంలోనైనా పసిపిల్లలు తప్ప తిని కూర్చునే వర్గం ఉండేది కాదు. శ్రమకు ఫలితం అందరికీ సమానంగా దక్కేది. అప్పటి భాషలో "నేను" అనే పదమే ఉండేది కాదనీ "మేము" అనే మాటను మాత్రమే వాడేవారనీ కొందరు పరిశోధకుల అభిప్రాయం. ఈ సమానత్వం తగ్గి, పనుల నిర్వహణలో వ్యత్యాసాలు నెమ్మదిగా ఏర్పడసాగాయ. అయతే ఈ శ్రమ విభజన ఈనాటిది కాదు. ఆదిమయుగంలో ఇది మొదటిసారిగా గణాచారులూ, మంత్రగాళ్ళూ, మతపెద్దలూ, అతీతశక్తులను గారడీ ద్వారా వశపరుచునేందుకు ప్రయత్నించిన ఇతర వర్గాలతో మొదలయ ఉంటుంది. మనిషి మనుగడకు తిండీ, ఇల్లూ, బట్టలే కాక ప్రకృతిశక్తులతో సంపర్కం పెట్టుకుని వాటిని "మంచి" చేసుకోవడం కూడా చాలా అవసరమనిపించింది. ఆ రోజుల్లో కష్టాలకు ఎదురీదుతున్న మానవజాతికి ప్రకృతి ఎంత యదార్థమైనదిగా కనబడేదో వాటి వెనక ఉన్నట్టుగా వారు ఊహించుకున్న అతీతశక్తులు కూడా అంత యదార్థమైనవిగానూ అనిపించేవి. అందువల్ల ఇటువంటి పనులు చేపట్టడం సమాజశ్రేయస్సు కోసమేనని అందరూ భావించారేకాని పని ఎగగొట్టే ఉపాయమని అనుకోలేదు.
ఆనాటి సమాజంలో మొదటిసారిగా పొడచూపుతున్న ఆధ్యాత్మిక ధోరణులవల్ల ఈ తొలి ఆటవిక పూజారులకు శరీరశ్రమ చేసే అవసరం తప్పింది. ఇలాంటివారు ఈనాటికీ అతి పురాతనమైన ఆదివాసీ తెగలలో కనిపిస్తారు. తరవాతి దశలలో ఆత్మకూ, శరీరానికీ ఉన్న తేడాలూ, అలాగే మనసుకూ, శరీరానికీ భేదాలూ, ఆలోచనకూ, ఆచరణకూ వ్యత్యాసాలూ అవగతం కాసాగాయ. ఇది అప్పటి సమాజాన్ని ప్రగతిపథాన ముందుకు నెట్టింది. ఇందులో భాగంగానే శరీరశ్రమకూ, మానసికశ్రమకూ తేడాలు ఏర్పడడంతోటే సమాజంలో వర్గాలు కూడా మొదలయాయ. జీవనోపాధికై శ్రమించనక్కర్లేని అల్పసంఖ్యాక వర్గం ఒకటి తొలిసారిగా ఏర్పడింది.
ఒళ్ళు హూనం చేసుకోకుండా తీరికగా ఉండే అరుదైన అవకాశాన్ని మనుషులు మొదటగా ఆకాశాన్ని పరిశీలించడానికే ఉపయోగించుకున్నట్టు కనబడుతుంది. ఎక్కడో ఆకాశాన ఉన్న నక్షత్రాలకేసి చూడడమూ, వాటిని గురించి ఊహించుకోగలగడమూ మనిషితప్ప మరే జంతువూ చెయ్యలేని పని. నక్షత్రపరిశీలన క్రమంగా ఒక ఉపయోగకరమైన ప్రక్రియగా తయారు కాసాగింది. కాలంతోబాటు తారల, గ్రహాల కదలికలూ, కాలగణనానికి పనికొచ్చే ఈ మార్పులను బట్టి పరిసరాల్లో ప్రతి సంవత్సరమూ కలిగే పరిణామాలూ అన్నీ తమ జీవితాలకు పనికొచ్చేవిగా మనుషులు గుర్తించసాగారు. అప్పట్లో ఇది ఖగోళశాస్త్రంగా కాక మతభావనలతో కలగలిసిపోయన అయోమయంగానే రూపొందినప్పటికీ మానవ నాగరికతకు ఇదే తొలి పునాది అయంది.
ప్రాచీన ఈజిప్ట్‌లో గణితశాస్త్రాన్ని మొదలుపెట్టినది అక్కడి పూజారి వర్గమే. ప్రకృతిని గురించిన సమాచారమూ, దానితో బాటు మంత్రతంత్రాలూ ఇవే మొదటగా రూపొందిన జ్ఞాన, విజ్ఞానాలు. ఇవి సమాజాన్ని నియంత్రించగలిగే శక్తివంతమైన సాధనాలుగా రూపొందుతున్న కొద్దీ వీటిని అదుపులో ఉంచుకునే అల్పసంఖ్యాకులది క్రమంగా పైచెయ్య కాసాగింది. ఉదాహరణకు ఈజిప్ట్‌లో నైల్ నది పొంగినప్పుడల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం కలుగుతూ ఉండేది. రుతువుల మార్పును బట్టి ఇటువంటి దెప్పుడు జరుగుతుందో ఊహించి సరిగ్గా చెప్పగలిగిన గుళ్ళోని "శాస్తుర్లు"గారిని తక్కినవారు "నోరు వెళ్ళబెట్టుకుని" చూడడమే కాదు, తమ ప్రాణాలను కాపాడగలిగిన దేవుడిగా కూడా భావించి ఉండవచ్చు.
అలాగే లిపులను ఉపయోగించి, రాతపని చెయ్యడం కూడా "పామరులకు" అసాధ్యంగా ఉండేది. దీని "రహస్యాలను" పూజారులు ఇతరులకు చెప్పేవారుకాదు. లిపి అనేది మొదటగా తయారైనసుమేరీయన్ నాగరికతలో రాయడమనేది ఒక్క పెద్ద విషయంగా ఉండేది. జరిగిన విషయాలను రాసిపెట్టడమే కాదు, జరగబోయేవి కూడా పాత రచనల్లో దాగి ఉంటాయని అక్కడి పూజారులు ఊహించసాగారు. అందులో యదార్థంతో బాటు మంత్ర భావనలు కూడా ఉండేవి. అధికసంఖ్యాకులు చేతులతో కష్టపడి పని చేస్తున్న యుగంలో ఒక చిన్న మేధావి వర్గం తయారుకాసాగింది.
క్రమంగా ఈ రెండు వర్గాలకూ మధ్య పూడ్చలేని ఎడం ఏర్పడసాగింది. కేవలం తమ తెలివితేటలతో నెట్టుకురాగలిగిన వర్గం ఇతర సామాన్యప్రజలకు క్రమంగా దూరం అవుతూవచ్చారు. వారికి శరీరశ్రమ అంటే ఏహ్యభావం పెరగసాగింది. కండలు కరిగించి పనిచేసే వర్గంవారు అక్షరాలా గొడ్డుచాకిరీకి మాత్రమే పనికొస్తారనే భావన ఏర్పడింది. అక్షరజ్ఞానమూ, పదసంపదా, ఆలోచించగలగడమూ "ఉన్నతమైన" లక్షణాలుగా భావించబడ్డాయ.
ఇలాంటి తూస్కార ధోరణిని దాచుకోవలసిన అవసరమూ తగ్గిపోయంది. క్రీస్తుకు పూర్వం 2000ఏళ్ళ క్రితం తన కొడుకును "వ్రాయసకాడు"గా శిక్షణ నిప్పించదలచిన తండ్రి కుర్రవాడితో జరిపిన సంభాషణ చరిత్రకారులకు లభ్యమయంది.తండ్రి ఉద్బోధ ఈ విధంగా సాగుతుంది. "శరీరశ్రమ చేసేవాడికి అది చెయ్యడం తప్ప మరో మార్గంలేదు. రాతపని చేసేవాడికి తక్కిన బరువు బాధ్యతలేవీ ఉండవు. కమ్మరి చేతివేళ్ళు చూడు, మొసలి ఆకారంలో ఉంటాయ. వాడి దగ్గర ఒకటే కంపు. ఇళ్ళు కట్టేవాడెప్పుడూ పందిలాగా బురదలో దొర్లుతూ ఉండాలి. వాడి బట్టలు కూడా బురదతో అట్టలుకట్టి ఉంటాయ. బాణాలు చేసేవాడు రాతిములికి కోసమని గాడిదలాగా ఎడారుల వెంట తిరగాలి. చాకలి నైల్ నది ఒడ్డుకు వెళితే మొసళ్ళు వాణ్ణి పలకరిస్తూ ఉంటాయ. అదే వ్రాయసకాడవైతే ఎవరూ నిన్ను గదమాయంచలేరు. రాజుగారింటి భోజనం లభిస్తుంది. మంచి జీవితం, ఆరోగ్యం, సిరిసంపదలూ ఉంటాయ. నీకేకాదు, నీ పిల్లలకూ, వారి పిల్లలకూ అందరికీని".
ప్రాచీన గ్రీక్ నాగరికతలో కూడా ఇటువంటి భావనలే ఉండేవి. "చేతిపని చెయ్యడం అవమానకరం. పొద్దస్తమానమూ గదిలో ఏ నిప్పుల కుంపటి దగ్గరో కూర్చుని ఉండాలి. అలాంటి జీవితం దేహాన్నేకాదు, ఆత్మను కూడా నాశనం చేస్తుంది. ఈ పనివారికి స్నేహితం చెయ్యడమూ, పౌరబాధ్యతలు చేపట్టడమూ వీలవదు. అందుకే వీరితో ఎక్కువమంది స్నేహంగా ఉండరు. వీరికి తగినంత దేశభక్తికూడా ఉండదు". సాటి ప్రజలకోసం రెక్కలు ముక్కలు చేసుకునే వర్గం పట్ల ఈనాటికీ కనిపిస్తున్న చులకన ఏనాటిదో దీన్ని బట్టి తెలుస్తుంది. మనిషి మనస్సు వికసించి, ఊహాశక్తివల్ల తక్కిన ప్రాణులతో పోలిస్తే అపూర్వమైన విజయాలను సాధించడం మొదట్లో మానవజాతిని ప్రభావితం చేసినమాట నిజమేకాని, ఇటువంటి నిరసన భావం మాత్రం సమాజం వర్గాలుగా విడిపోవడాన్నే సూచిస్తుంది.
అంతేకాదు; భావనలూ,ఆలోచనలూ, మాటలూ మొదలైనవాటికి యదార్థ ప్రపంచంతో సంబంధం లేని ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్నట్టుగా భ్రమ కూడా కలగసాగింది. చేతులకు మట్టి అంటుకోకుండా నెలల తరబడి ఇహ, పర లోకాలను గురించి ఆలోచిస్తూ రకరకాల ప్రతిపాదనలు చెయ్యడం, వాటి గురించి సాటి వేదాంతులతో చర్చించడం, సమాజాన్నీ, జీవితాలనీ విశ్లేషించడం మొదలైనవన్నీ మేధావి వర్గానికి పరిమితమైన మేధోవ్యాపరంగా తయారైంది. యదార్థ ప్రపంచానికి అంతకంతకూ దూరం కాసాగిన వర్గానికి కనబడుతున్నదంతా మాయ అనీ, ఆలోచనల ప్రపంచమే నిజమైనదనీ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మతాలలోనూ, వేదాంతంలోనూ కనబడే మూలభావన ఇదే. శ్రమవిభజనను చక్కగా ఉపయోగించుకుని "పైకొచ్చిన" వర్గాలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయని వేరే చెప్పక్కర్లేదు.
1 Comments:
canada goose
balenciaga speed
kevin durant shoes
nhl jerseys
mbt shoes
balenciaga shoes
cheap jordans
moncler outlet
off white clothing
nike shoes
Post a Comment
<< Home