Wednesday, September 14, 2005

ఆలోచనల అయోమయమే ఆధ్యాత్మికవాదం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మనిషి మెదడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచ్చగా భౌతికమైన జీవపరిణామ సూత్రాల ప్రకారం రూపుదిద్దుకున్న అవయవాల్లో ఒకటి. ఈ విషయాన్ని మరిచిపోకుండా ఉంటే తక్కిన సంగతులు అర్థం చేసుకోవచ్చు. మనకు కలిగే ఆలోచనలు మెదడులో జరిగే ఎలె్రకిక్‌ ప్రక్రియల ఫలితమే. మనుషులూ, అనేక క్షీరదాలూ ప్రధానంగా నాడుల స్పందనలపై ఆధారపడి బతికే ప్రాణులు. ఈ రకమైన శరీర వ్యవస్థ ఉందంటే అది భౌతిక ప్రపంచంలో బైటినుంచి వచ్చిపడే కష్ట నష్టాలనూ, ఆటుపోట్లనూ భరించి బతికేందుకు ప్రకృతిసిద్ధంగా జరిగిన ఏర్పాటు మాత్రమే. తమ శరీరాల చుట్టుపక్కల గురిచిన సమాచారం అనుక్షణమూ తెలియడం మనవంటి ప్రాణులకు అవసరం కనక నాడీమండలమూ, మెదడూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయ. ఇది ప్రాణుల వ్యక్తిగత వ్యవహారం. ప్రకృతికి దీనితో సంబంధం లేదు. ప్రాణుల చైతన్యం, స్పృహ, ఆత్మజ్ఞానం వగైరాలన్నీ వాటి ప్రయోజనాలకై రూపొందినవి. ప్రకృతిని అవగాహన చేసుకోవడం వాటికి సంబంధించిన గొడవ. ప్రకృతికి సంబంధించినంత వరకూ ఈ అవగాహన "అనవసరమే". అందుకే కాబోలు ప్రకృతి అనేది మన అవగాహనకు లోనవడమే అవగాహనకు అందని విషయంగా అనిపిస్తుందని ఐన్‌ష్టయన్‌ ఒక సందర్భంలో అన్నాడట.
ఇంతకీ ప్రాణులు, చైతన్యం అంటూ మనం జనరలైజ్‌ చేస్తున్న విషయాలన్నీ భూమి మీద మనకు తెలిసిన ప్రాణుల విషయంలోనే. బ్రహ్మాండమైన విశ్వాంతరాళంలో ఎన్నెన్నో ప్రాంతాల్లో జీవరాశి ఉద్భవించే ఉంటుంది కాని వాటి గురించిన వివరాలేమీ తెలియవు. మనకు తెలిసిందల్లా భూమి మీద కార్బన్‌ డయాక్సడ్‌ పీల్చి బతికే మొక్కల గురించీ, ఆక్సిజన్‌ పీల్చి బతికే జంతువుల గురించీ, గాలి లేకుండా బతకగలిగే కొన్నిసూక్ష్మజీవుల గురించీను. మన గేలక్సీలోని (పాలపుంత) 40 వేల కోట్ల నక్షత్రాల్లో మన సూర్యుడు ఒక్కటి మాత్రమే. మన పాలపుంతవంటివి పదుల వేల కోట్ల సంఖ్యలో ఇతర గేలక్సీలు నక్షత్ర సముదాయాలుగా విశ్వంలో కనిపిస్తాయ. అవి ఎటువంటివో, ఏయే పదార్థాలతో కూడుకున్నవో, అందులో ఎన్ని రకాల "బుద్ధి జీవులు" పెరగగలవో స్టార్‌ ట్రెక్‌ స్క్రిప్ట్‌ రచయతలు కూడా ఊహించలేరు. వీటన్నిటినీ చూస్తే అతి పరిమితమైన సమాచారంతో మనం బుద్ధీ, జ్ఞానం అంటూ అన్నీ తెలిసిపోయనట్టు చర్చించడం అర్థంలేని పనిగా అనిపిస్తుంది.
మనుషులకు "కళ్ళారా" చూసేవన్నీ నిజంగా అనిపించినా అందులో చాలా విషయాలు యదార్థమైనవి కావు. సజీవంగా కదులుతున్నట్టుగా అనిపించే సినిమా దృశ్యాలన్నీ వేగంగా తిరిగే నిశ్చలన చిత్రాలే. అలాగే మనకు కనబడే రంగుల గురించిన మన అవగాహన కూడా కొంతవరకూ సబ్జెక్టివ్‌గానే ఉంటుంది. కలల ప్రపంచంలో మరింత గందరగోళం తోడవుతుంది. కలలు కంటున్నప్పుడు మెదడులోని దృశ్యనాడికి సంబంధించిన కేంద్రాల్లో ప్రక్రియలు తీవ్రతరం అవుతాయట. మతం పేరుతో తాము మభ్యపడడం వల్లనో, ఇతరులను మభ్యపెట్టేందుకనో ప్రచారకులు దృశ్యాల మీదా, చూపుకి సంబంధించిన అనుభూతుల మీదా ఎక్కువగా ఆధారపడతారు. చేతివాటం ప్రదర్శించి విభూతినీ, శివలింగాలనూ చేతిలో చూపే బాబాల సంగతి వదిలేసినా, నిజాయతీగా మతవిశ్వాసాలు కల వారికి అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయ.
ఉదాహరణకు వెంకటేశ్వరస్వామి వల్ల ఇన్‌ౖస్పెర్‌ అయ రచనలు చేసిన నవలాకారిణికి ఆకాశంలో మూడు నామాలు (నిజంగానే) కనబడతాయ. ఏ ప్రలోభమూ లేకుండానే క్రీస్తుమతం పుచ్చుకునేవారికి కళ్ళ ముందు సిలువ ప్రత్యక్షం అవుతుంది. మెదడు గుండా నిత్యమూ ఎలె్రకిక్‌ సంకేతాలు ఎడాపెడా ప్రసరిస్తూనే ఉంటాయ. నిజానికీ, భ్రమకూ తేడా తెలియకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ అవకాశాలు కలుగుతాయ. బ్రెయన్‌ సర్జరీలో కొన్ని భాగాలను స్పృశించినప్పుడు ఏవేవో కనబడుతున్నట్టుగా, వినబడుతున్నట్టుగా అనిపించవచ్చు. ప్రమాదాల్లోనో, యుద్ధాల్లోనో అవయవాలు కోల్పోయనవారికి అవి ఇంకా నొప్పి పుడుతున్నట్టుగా అనిపించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మెదడులో కలిగే భ్రమలవల్ల తలెత్తిన భావాలే. వీటిని రోగాలకు సంబంధించినవిగా అనుకుంటాం. కాని ఎవడో బాబా ఆశీర్వదించినప్పుడో, మంత్రం చదివినప్పుడో మనకు వెన్నులో చలివంటిది పుట్టుకొస్తే అది ఆధ్యాత్మిక శక్తివల్ల కలిగిందనుకుంటాం. అప్రయత్నంగా మనకు ఎటువంటి భావన కలిగినా దడుచుకుని అతీంద్రియశక్తుల గురించి పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇతరత్రా సహజంగానే మన మెదడులోని కొన్ని భాగాలు మన నియంత్రణకు లోబడకుండా ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఉండడం వల్లనే మనం బతకగలుగుతున్నామనేది మనకు తట్టదు.
మతం, దేవుడు, ఇహలోకం, పరలోకం అంటూ అర్థం లేకుండా మాట్లాడేవారు చాలా ప్రాథమిక స్థాయలో పొరబడుతు న్నారనేది గుర్తుంచుకోవాలి. వారి విశ్వాసాలకు ఆధారాలు చాలా సామాన్యమైన, అసంగతమైన నాడీసంకేతాలు మాత్రమే. ఎంత గొప్ప ప్రవక్త అయనా తన విశ్వాసాలను ప్రచారం చెయ్యటానికి "భావాలను" దాటి ముందుకు పోలేడు. దేవుడైనా, ప్రేతాత్మ అయనా అన్నిటికీ "అసామాన్యం", "అసాధారణం" అనిపించే అనుభవాలే ఆధారాలు.
మనిషి మెదడు నిర్మాణం గురించి ఇటీవలనే ఎక్కువ సమాచారం లభిస్తోంది. ఇందులో "సామాన్యం", "సాధారణం" అనదగినవి ఏమిటో కాస్తకాస్తగా అర్థం అవుతోంది. ఈ లోపల మిడిమిడిజ్ఞానంతో పెద్ద విషయాలు మాట్లాడేవారిని సీరియస్‌గా తీసుకోకూడదు. పైగా, ఇలాంటివి నమ్మనివారిని నాస్తికులనీ, నమ్మేవారిని ఆస్తికులనీ అభివర్ణిస్తూ ఇద్దరినీ సమానస్థాయలో ఉంచడం బొత్తిగా అర్థంలేని పని. మాదక ద్రవ్యాలు సేవించినవారి మెదడులోనూ, పూనకం వచ్చినవారి నరాల్లోనూ కలిగేవి రుగ్మతలే. ఎంత మంచి మనసుతో నమ్మినవారైనా సరే కనబడని ఆధ్యాత్మిక శక్తులను నమ్మేవారు దొడ్డిదారిన ఉన్నట్టే. "మతపిచ్చి" అనేది కూడా ఒక జబ్బు అని అందరూ గుర్తించాలి. ఇది వెక్కిరింతగానో, ద్వేషంతోనో అంటున్నది కాదు.
యదార్థ ప్రేరణలకూ, అసంకల్పిత ప్రేరణలకూ తేడాలను గుర్తించలేక పొరబడడమే ఆదిమయుగం నుంచీ మనుషులు చేస్తూ వస్తున్నది. వీరు వర్ణించే దేవుళ్ళూ, మతాలూ, ఇతర గ్రహాలూ, నక్షత్రాలూ, గేలక్సీల మాట అలా ఉంచి, మెదడూ, నాడీమండలమూ లేని ఇతర ప్రాణుల సంగతులు కూడా పట్టించుకున్నట్టు కనబడవు.