Wednesday, September 14, 2005

అణచివేతకు గురికావడం జన్యులోపమా?
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఆధునిక మానవజాతి 2 లక్షల సంవత్సరాల కిందట ఆవిర్భవించిందని విజ్ఞానశాస్త్రం చెపుతోంది. మనుషులు అంతకు ముందునుంచే తెగలుగా, సముదాయాలుగా జీవిస్తూ వస్తున్నారు. ఈనాడు ఎన్నెన్నో సామాజిక వర్గాల, జాతుల, మతాలవారీగా విడిపోయన మానవసమాజంలో అంతఃకలహాలకూ, ఎడతెగని సంఘర్షణలకూ కొదవేమీ లేదు. ఇందుకు ముఖ్యకారణం సాంఘిక అసమానతలే. కొందరు విశ్లేషకులు మనుషులందరూ సమానం కాదనీ, వారి స్వభావాల్లోనూ, తెలివితేటల్లోనూ తేడాలు తప్పనిసరిగా ఉంటాయనీ, ఈ పరిస్థితిని సరిదిద్దడం వీలవదనీ అంటారు. వర్గాల మధ్య జరిగే పోటీలో కొందరిది పైచెయ్య అయందంటే అందుకు దోహదపడే కారణాలన్నీ సామాజికమైనవి కావనీ, మనుషులకు సహజంగా పుట్టుకతో సంక్రమించే జన్యువుల పాత్ర కూడా ఉంటుందనీ తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. జన్యువుల కారణంగానే స్త్రీలకూ, నల్లవారికీ తెలివితేటలు తక్కువగా (?) ఉంటాయనీ, నేరప్రవృత్తికీ, హోమో సెక్షువల్‌ వైఖరి వంటివాటికీ కూడా జన్యువులే కారణమనీ దబాయంచే శాస్త్రవేత్తలూ ఉన్నారు. "వెనకబడ్డ" వర్గాల కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి స్కూళ్ళూ, ఇతర సదుపాయాలూ కల్పించడం అనవసరమనీ, ఏం చేసినా అలాంటివారు పోటీలో నెగ్గలేని జన్యులక్షణాలతో పుట్టడంవల్ల ఎలాగూ ముందుకు రాలేరనీ వాదించేవారూ ఉన్నారు. ఇందులో నిజమెంతో, సైన్సు చాటున దాగిన వర్ణ, లింగ వివక్ష ఎంతో తేలవలసి ఉంది. ఈ విషయాల గురించి కొంత చర్చించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో జీన్స్‌, జెనెటిక్స్‌ అంటూ తరుచుగా వినబడే మాటలకు సరైన అర్థాలను తెలుసుకోవడం కూడా (బయాలజీ అంతగా చదువుకోని) సామాన్య పాఠకులకు ఈ సందర్భంలో అవసరం కనక ముందుగా ఆ వివరాలు చూద్దాం.

పంతొమ్మిదో శతాబ్దంలో ఆ్రసియాకు చెందిన మెండెల్‌ ప్రాణులకూ, వృక్షజాతులకూ వంశపారంపర్యంగా సంక్రమించే లక్షణాలను గురించి మొదటగా పరిశోధనలు చేశాడు. కుక్కలకు పిల్లులూ, పిల్లులకు చేపలూ పుట్టవనేది అనాదిగా మనుషులకు తెలుసు కాని పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు ఎందుకు, ఎలా వస్తాయో మనకు జెనెటిక్స్‌, లేక జన్యుశాస్త్రం ద్వారానే వివరంగా తెలుస్తుంది. చెట్లూ, మొక్కలూ, ఇతర ప్రాణులన్నిటిలోనూ జీవకణాలుంటాయ. అతిసూక్ష్మజీవులైన అమీబా, బాక్టీరియావంటివి ఏకకణజీవులు కాగా తక్కినవాటిలో అనేక కణాలుంటాయ. ఈ కణాలన్నీ ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చెందుతూ, నిత్యమూ ప్రాణి బతకడానికి అవసరమయే వేలకొద్దీ జీవరసాయనిక ప్రక్రియల్లో పాల్గొంటూ ఉంటాయ. మనుషుల జీవ ప్రక్రియలని శాసించే ఈ కణాలు ఎంత సూక్ష్మమైనవంటే వాటి పరిమాణం ఒక మిల్లిమీటర్‌లో వెయ్యోవంతు కూడా ఉండదు. ఇవి రకరకాల ఆకారాల్లో ఉంటాయ. చర్మం పైపొర కణాలు చదునుగానూ, కండరాల్లోనివి సన్నగా, పొడుగ్గానూ ఉంటాయ. నాడుల కణాల కొసలకు ఆక్టోపస్‌లాగా "వేళ్ళు" మొలిచి ఉంటాయ. మనుషుల్లోనూ, జంతువుల్లోనూ ఉండే ఈ చిన్నచిన్న జీవకణాల లోపల ఇంకా సూక్ష్మమైన అనేక ప్రత్యేక నిర్మాణ విభాగాలుంటాయ. ఆర్గనెల్‌ అనే పేరుగల ఈ ఒక్కొక్క విభాగంలోనూ వేరువేరు పదార్థాలుంటాయ. కొన్నిటిలో ప్రోటీన్లూ, లిపిడ్‌లవంటి కొవ్వుపదార్థాలూ తయారౌతాయ. వీటిలో అన్నిటికన్నా పెద్దదైన న్యూక్లియస్‌ (కేంద్రం) అనే విభాగం అతిముఖ్యమైనది. ఇది జీవప్రక్రియలకు అధికార కేంద్రంగానూ, ఇన్‌ఫర్‌మేషన్‌ లైబ్రరీగానూ కూడా పనిచేస్తుంది. న్యూక్లియస్‌ లోపల సుమారు అయదారడుగుల పొడవున్న అతిసన్నని డీఎన్‌ఏ (డి ఆక్సీ రైబో న్యూక్లియక్‌ ఆసిడ్‌) పదార్థపు పోగులు అనేకం ప్రోటీన్ల చుట్టూ చుట్టుకుని ఉంటాయ.
పొడుగాటి డీఎన్‌ఏలోని ఒక్కొక్క భాగాన్ని జీన్‌ అంటారు. అనేక జన్యువులు కలిస్తే డీఎన్‌ఏ పోగు తయారౌతుంది. ఒక్కొక్క జన్యువుకూ ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ వివిధ ఎన్‌జైమ్‌లూ, ప్రోటీన్లూ ఎప్పుడు, ఎలా తయారవాలో నిర్దేశిస్తాయ. ఇవి ప్రాణుల మనుగడకు చాలా అవసరమైన ప్రక్రియలు. వీటిని బట్టే మన కళ్ళ రంగూ, బటాణీ కాయలోని గింజల సంఖ్యా, బాక్టీరియా ఆహారపుటలవాట్లూ మొదలైనవన్నీ నిర్ధారణ అవుతాయ. అలాగే మన పోలికలు మన సంతానానికి వస్తాయ. మెలికలు తిరిగినతాటి నిచ్చెనలాగా కనబడే రెండేసి డీఎన్‌ఏ పోగులని కలుపుతూ మధ్యలో అక్కడక్కడా మెట్లలాంటి లంకెలుంటాయ. కణవిభజన జరిగే సమయానికి ఒక్కొక్క పోగూ మడతలు పడి, కాస్త దళసరిగా కాడ ఆకారం కలిగిన 23 క్రోమొసోమ్‌లుగా రూపొందుతుంది. ఈ క్రోమొసోమ్‌ల పొడుగునా జన్యువులు నిర్దిష్ట సంఖ్యలో, తమతమ స్థానాల్లో అమరి ఉంటాయ. స్త్రీ పురుషుల పునరుత్పత్తి కణాల్లోని క్రోమొసోమ్‌లు తమలో నిక్షిప్తమైన "సమాచారాన్ని" వారసత్వపు లక్షణాలుగా తరవాతి తరానికి అందిస్తాయ. వీటిలో అప్పుడప్పుడూ యాదృచ్ఛికంగా మార్పులు (మ్యుటేషన్‌లు) జరగడంవల్ల తల్లిదండ్రులకూ, సంతానానికీ శరీర లక్షణాల్లో కొంత వ్యత్యాసం ఏర్పడుతుంది.
ఒక ప్రాణియొక్క క్రోమొసోమ్‌ల పూర్తి సముదాయంలోని జన్యువులన్నిటినీ కలిపి జీనోమ్‌ అంటారు. వివిధ ప్రాణుల్లో దీన్ని మాప్‌ రూపంలో చిత్రీకరించే పని 1990లో మొదలైంది. ఈ జీనోమ్‌ ప్రాజెక్ట్‌లో మనుషులకు గల 23 క్రోమొసోమ్‌ లలో ఉండే దాదాపు లక్ష జన్యువుల, 300 కోట్ల డీఎన్‌ఏ బేస్‌ జతల వివరాలు సేకరించారు. పువ్వుల రంగులనూ, సీతాకోకచిలకల రెక్కల మీది చుక్కలనూ జన్యువులే నిర్ణయస్తాయ. కాయగూరలూ, ధాన్యాలూ చీడపురుగులకు గురికాకుండా జన్యుపరమైన మార్పులు కృత్రిమంగా చెయ్యవచ్చు. హత్యలూ, మానభంగాలూ జరిగిన చోట దొరికే సాక్ష్యాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవటానికీ, పిల్లల తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకూ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించవచ్చు. మనుషులందరిలోనూ ఒకలాంటి జన్యువులే ఉన్నప్పటికీ ఏ ఇద్దరి మధ్యనైనా స్వల్పమైన (0.05 నుంచి 0.1 శాతం) తేడాలుంటాయ. దీన్నిబట్టి వేలి ముద్రలాగా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మనిషిని ఆనవాలు పట్టవచ్చు. జీనోమ్‌ పరీక్షలు జరిపితే ఒక వ్యక్తికి భవిష్యత్తులో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కలగవచ్చునని తెలిసే అవకాశం ఉంది. ఇటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనీ, జన్యుపరీక్షలను బట్టి ఉద్యోగం, బీమా మొదలైన విషయాల్లో వివక్ష తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
కొన్ని రకాల జబ్బులకు "చెడిపోయన" జీన్‌ స్థానంలో ఆరోగ్యకరమైనవాటిని అమర్చి చికిత్స చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ. అయతే మొదట్లో ఆశించినట్టుగా ఫలానా రకం కేన్సర్‌ ఫలానా జన్యువువల్ల కలుగుతుందని చెప్పగలిగే అవకాశం మాత్రం కనబడటం లేదు. కేన్సర్‌ సోకడానికి కారణం సగం జన్యులోపం కాగా మిగతాది పరిసరాల ప్రభావమేనని తేలుతోంది. అలాగే మనిషి నైజానికీ, ప్రవర్తనకీ జన్యువులు మాత్రమే కారణమని చెప్పడం అసాధ్యంగా అనిపిస్తోంది.
మన స్వాభావిక లక్షణాలకు జన్యువులు ఎంతవరకూ బాధ్యత వహిస్తాయ? ఎవరైనా ఏ క్రికెట్‌లోనో రాణించడానికి ఒక జన్యువూ, లెక్కల్లో సున్నామార్కులు రావడానికి మరొక జన్యువూ కారణమనుకోవచ్చా? వేల సంవత్సరాలకొద్దీ చదువుకు నోచుకోని అధికసంఖ్యాకులది తక్కువ రకం జన్యులక్షణమా? ఈనాడు అకస్మాత్తుగా వారిని అగ్రవర్ణుల తోనూ, పైవర్గాలవారితోనూ పోల్చి చదువు రాదని అవహేళన చెయ్యడం సమంజసమేనా? మనుషుల నైజానికీ, ప్రవర్తనకూ కారణాలు శారీరికంగా సంక్రమించిన లక్షణాలా, సామాజికమైనవా?
నాజీలు జాతి వివక్ష గురించి చేసిన ప్రచారం జన్యుపరమైన ప్రయోగాల విషయంలో అప్పట్లో కొంత విముఖత కలగజేసింది. ఆ తరవాతి కాలంలో జన్యు పరిశోధనల్లో కలిగిన ప్రగతివల్ల మళ్ళీ ఆ విషయాల్లో ఆసక్తి పెరిగింది. గత పదేళ్ళుగా సాగిన జీనోమ్‌ పరిశోధనల్లో మునుపు అనుకున్నట్టుగా మనుషులకు లక్షకు పైగా జన్యువులు లేవనీ, కేవలం 30 వేలే ఉన్నాయనీ తేలింది. పళ్ళమీద వాలే జోరీగ (ఫ్రూట్‌ ౖఫె) కన్నాఇది రెండింతలు మాత్రమే ఎక్కువ. జొన్నల్లోనూ, చుంచుల్లోనూ దాదాపు ఇన్ని జన్యువులూ ఉంటాయ. అనుకున్నదాని కన్నా మనుషుల్లో జన్యువులు అతి తక్కువ సంఖ్యలో ఉండడం శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మనుషుల తెలివితేటలకూ, ఇతర ఆధిక్యతకూ తలొక జన్యువూ ఉంటుందని అనుకున్న జాత్యహంకారులకు ఆశాభంగం కలుగుతోంది. ఇది హేతువాదులకూ, భౌతికవాదులకూ విజయసూచకం.
జన్యువులు మనుషుల్లో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తాయనడంలో సందేహం లేదు కాని ఇతర విషయాలు కూడా చాలానే ఉన్నాయ. ప్రతి వ్యక్తిలోనూ కనబడే ఆలోచనా విధానమూ,వివిధ విషయాల్లో ప్రకటితం అయే వైఖరీ, ప్రవర్తనా, స్వభావమూ ఎన్నోఅంశాలపై ఆధారపడే సంక్లిష్టమైన వ్యవహారం. తెలివితేటలూ, చురుకుదనమూ, ప్రతిభా, సామాజిక ప్రవర్తనా మొదలైనవన్నీ కేవలం జన్యువుల లక్షణాలే అనుకోవడంలో అర్థం లేదు. పుట్టి పెరిగిన పరిస్థితులూ, లభించినవీ, లభించనివీ అనేక ప్రేరణలూ, నేర్చుకున్నవీ, నేర్చుకోనివీ అయన విషయాలూ, ఇలా ఎన్నెన్నో కలగలిసి మనిషి స్వభావానికి ఒక స్వరూపాన్నిస్తాయ. పెంపకమూ, చిన్నప్పటి కుటుంబ వాతావరణమూ చాలా ముఖ్యపాత్ర నిర్వహిస్తాయ. ఈనాడు ప్రభుత్వ వర్గాలు కొన్ని ప్రయత్నాలను ఏ ఉద్దేశంతో చేపట్టినప్పటికీ వెనకబడ్డ కులాలనూ, వర్గాలనూ ప్రోత్సహించడాన్ని గర్హిస్తున్నవారు వారి "వెనకబాటుతనం" పుట్టుకతో (అంటే జన్యుపరంగా) వచ్చిన లక్షణమని బాహాటంగానే అంటారు. కొన్ని వేల సంవత్సరాలుగా సామాజికంగా ఎదగడానికి అవకాశం లభించని అనేకులకు కొన్ని రాయతీలు లభించడం వారికి కంటగింపుగా ఉంటుంది.
మరొక విషయమేమిటంటే ప్రాణులన్నిటిలోనూ ఒకేలాంటి జన్యువులున్నాయ. మనుషులే కాదు బాక్టీరియాలోనూ, మనలోనూ కొన్ని జన్యువులు ఒకలాంటివే. చూపుకు సంబంధించిన మనిషి జన్యువును కళ్ళు లేని ఏ ఈగలోనో ప్రవేశపెడితే దానికి చూపు వచ్చేస్తుందని రుజువైంది. ప్రకృతిలో మనిషికి ప్రత్యేక స్థానమంటూ లేదు. ప్రాణులన్నీ ఒక్క కుదుటినుంచి పుట్టినవే. ఎటొచ్చీ మనుషులకూ వానపాములవంటి "తక్కువ రకం" జీవాలకూ తేడాలు ఏర్పడటానికి ప్రోటీన్ల "ప్రభావక్షేత్రాలు" కారణం కావచ్చు.
జన్యువుల పాత్ర తక్కువని కాదు. జన్యువులకుండే స్వాభావిక లక్షణం ఒక స్థోమతవంటిది. అది బయటపడాలంటే పరిసరాలు ప్రేరేపించితీరాలి. జన్యువులు బాహ్య ప్రేరణలను బట్టి స్విచ్‌ ఆన్‌, ఆఫ్‌ చేసినట్టుగా రకరకాల ప్రోటీన్లను తయారు చేస్తూ ఉంటాయ. జీవకణాల్లో ఉండే ప్రోటీన్లు రకరకాల పనులు నిర్వహిస్తాయ. ప్రోటీన్లలో ఒక్కొక్క భాగమూ ఒక్కొక్క పనిని చేపడుతుంది. ఈ భాగాలన్నీ ప్రభావక్షేత్రాలుగా పనిచేస్తాయ. వీటిలో చాలామటుకు అతిపురాతనమైనవి. మనలో ఉన్నవాటిలో వానపాముల్లో లేనివి 7 శాతం మాత్రమే. మరి తేడా ఎక్కడుంది? జన్యువుల సంఖ్య ఎక్కువ పెరగకపోయనప్పటికీ ప్రోటీన్ల సంఖ్య కాస్త పెరగడంతో అవి రకరకాలుగా కలయక చెంది విపరీతమైన మార్పులు కలిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
పరిసరాల ప్రభావంవల్ల జన్యువుల్లో కలిగే చిన్న చిన్న మార్పుల్లో మనుగడకు అనుకూలమైనవి నిలుస్తాయ. లాభకరమైన వ్యత్యాసాలు ప్రాణి సంతతి కొనసాగేందుకు దోహదపడతాయ. ఉదాహరణకు చింపాంజీలవంటి "నరవానరాల" జీవితానికీ మనిషిజాతిగా రూపొందబోతున్న ప్రాణులకూ 60 లక్షల సంవత్సరాల క్రితమే జీవనశైలిలో తేడాలు కలగసాగాయ. అచ్చగా చెట్లకే పరిమితం కాకుండా మైదానాల్లో జీవిస్తూ, ప్రాణరక్షణకై రెండు కాళ్ళమీద పరిగెత్తవలసి రావడంతో మానవజాతి లక్షణాలు తొలిసారిగా ఆవిర్భవించాయ. చింపాంజీలకూ మనకూ జన్యువుల్లో తేడా ఒకటి రెండు శాతం మాత్రమే. కాని 20 లక్షల సంవత్సరాల కిందట తొలి మానవులు జీవించిన పరిసరాలూ, వారికి కలిగిన ప్రత్యేకమైన అనుభవాలూ వారి శరీరాల్లోనూ, జీవనశైలిలోనూ, మెదడులోనూ ఎన్నో మార్పులు కలిగించాయ.
బాహ్యపరిస్థితులు మనుషుల జన్యువుల్లో మార్పులు కలిగించినంతగా ఇతర ప్రాణుల్లో కనబడదు. ఇవి రెండూ కలగలిసిపోయ, దాదాపు ప్రతిదానికీ ఆలోచనలపైనే ఆధారపడడం మనిషిజాతికి తప్పనిసరి అయంది. శతాబ్దాలు గడుస్తున్నకొద్దీ అనువైన స్థావరాలు వెతుక్కుంటూ వేల మైళ్ళు కాలినడకన వెళ్ళిన తొలిమానవులు ఎంతో వైవిధ్యం కలిగిన అనుభవాలకు గురి అయారు. గట్టిగా వంద గజాల దూరం కూడా రెండు కాళ్ళ మీద పరిగెత్తలేని గొరిల్లాలూ, చింపాంజీలూ చెట్లనే అంటిపెట్టుకుని ఉండిపోయాయ. జన్యువుల ప్రభావానికీ, పరిసరాల ప్రభావానికీ లోనయన మానవజాతి బాగా పరిణామం చెందింది. గుర్తుంచుకోవలసిన దేమిటంటే అనుభవం ద్వారా మనుషుల్లో కలిగే మార్పులకు జన్యువులు కొంతవరకూ ప్రభావితం అవుతాయన్నది నిజమే కాని ప్రతిదాన్నీ జన్యు లక్షణాలతో ముడిపెట్టలేం.
జన్యువులవల్ల కాని, పెంపకం, బాహ్య ప్రేరణలు వగైరాలవల్ల కాని మనుషులు యాంత్రికంగా ప్రభావితులు కాకపోవచ్చు. మనిషికి మొదటినుంచీ వివేచనా, వివేకమూ, అవగాహనా ఉంటూనే ఉన్నాయ. యుగాలు గడుస్తున్నకొద్దీ మనుషులు కొత్త విషయాలు నేర్చుకుంటూ, తెలిసిన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ ఎప్పటికప్పుడు ముందడుగు వెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. అలా జరగకుండా చూసేందుకు అడ్డుపడుతున్నవి సామాజిక శక్తులే. అణచివేతకు ఇతర పద్ధతులతోబాటు జన్యుశాస్త్రాన్ని సాకుగా వాడుకోవడం కూడా అందుకే.