"ఆత్మ"జ్ఞానం
మనలో ప్రతివారికీ "నేను" అనే భావనను గురించిన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ "నేను" అనేది ఏమిటి? ఇలా అనుకుంటున్నదెవరు? ఈ ప్రశ్నలు మన ఆత్మకు సంబంధించినవా? నాకూ, ఇతరులకూ ఉండే తేడాలెటువంటివి? మనలో ప్రతి ఒక్కరికీ ఆత్మ అనేది ఉంటుందా? ఈ భావాలకు మూలం ఏమిటి? ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజమే. వయస్సు పెరిగి, జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడో, సమీప వ్యక్తుల నిరాదరణకు గురి అయినప్పుడో మనం జీవితంలోనూ, సమాజంలోనూ ఏకాకులం అనే భావన కలుగుతుంది. ఇలాంటి వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం శారీరకంగానూ, మానసికంగానూ ఇంకెవరితోనూ ప్రత్యక్ష సంబంధం లేనివారమనేది అవగాహనకు వస్తుంది. శారీరక బాధలవంటి వాటికి గురయినప్పుడు మనం విలవిలలాడతాం కాని ఇతరులకేమీ అనిపించదు. ఎంత ఆత్మీయులతోనైనా కష్టసుఖాలు పంచుకోవడం అనేది మానసికంగా మాత్రమే సాధ్యం. ఎవరి మెదడూ, నాడీవ్యవస్థా వారివే. వేల ఏళ్ళుగా సమాజజీవితం అలవాటైన మనుషులకు ఒంటరితనం గొడ్డలిపెట్టులా అనిపించవచ్చు. అలాంటి మానసిక స్థితిలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ మొదలైనవాటికి అర్థం ఉన్నట్టుగా అనిపించడం సహజం. దాంతో బాహ్యప్రపంచంతో సంబంధం లేనటువంటి ఏదో ప్రత్యేక అస్తిత్వం గురించిన అపోహలు మొదలవుతాయి.
తమను గురించి తాము వ్యక్తిపరంగానూ (సబ్జెక్టివ్), వస్తుగతంగానూ (ఆబ్జెక్టివ్) కూడా ఆలోచించగలిగే శక్తి మనుషులకు మాత్రమే ఉంటుంది. అలోచనల లోకంలో వారే విహరించగలరు. అలాగే మనుషులకు జీవితంలో ఎదురయే సమస్యలన్నిటికీ దాదాపుగా ఆలోచనలే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం. ఎందుకంటే మరే జంతువుకూ ఉండనంత సంక్లిష్టమైన స్థాయిలో మనుషులు మానసిక జీవితం గడుపుతారు. ఇందులో స్వీయానుభవాలదే అగ్రస్థానం. స్వ, పర భేదాలు ఆరంభమయేది ఎప్పుడో ఎవరికీ గుర్తుండదు. మన ఉనికికీ, వ్యక్తిత్వానికీ మాత్రం ఇదే ఆధారం. ఇది ఎప్పుడు, ఎలా మొదలవుతుంది? "నేను, నా" అనే భావనలు పుట్టిన వెంటనే కాకపోయినా త్వరలోనే ఏర్పడతాయి. ఇందులో జరిగేవన్నీ, భౌతిక, శారీరక పరిణామాలే. పుట్టినప్పుడు తెల్ల కాయితంలా ఉన్న మన మెదడు ఆ తరవాత శరవేగంతో అనుభవాలను పొంది, ఎదగడం ఆరంభిస్తుంది. పెద్దయాక మన తెలివితేటలకూ, అనుభవజ్ఞతకూ, అవివేకానికీ కూడా ఈ ఎదుగుదలే కారణం అవుతుంది. ఊహ తెలియనప్పుడే మన పంచేంద్రియాలు పనిచెయ్యనారంభిస్తాయి. నేర్చుకోవడమంటే ఏమిటో మెదడు ముందుగా నేర్చుకోవడం మొదలుపెడుతుంది. సహజంగా అందరి విషయంలోనూ జరిగేదే కనక ఇదేమీ ప్రత్యేకంగా అనిపించదు. కానీ మన జీవితంలో సుమారు నాలుగోవంతు గడిచేదాకా ఎదిగే మెదడు ప్రాణికోటిలో ప్రత్యేకమైనది. మనుష్యులు మానసికంగా అపరిపక్వదశలో గడిపినంత వ్యవధి మరే జంతువూ గడపదు. ప్రపంచాన్ని గమనించి నేర్చుకునేది అన్నిటికన్నా ముఖ్యమైనది కనక పసి పిల్లలు అదేపనిగా తమ చేతి వేళ్ళకేసి చూసుకుంటూ, వస్తువుల మధ్య దూరాన్ని పసికట్టడం క్రమంగా నేర్చుకుంటారు. ఎందుకంటే మన కన్ను కేమెరాలాగా మూడు కొలతల ప్రపంచాన్ని రెండు కొలతల "తెర"పై చూపుతుంది. రెండు కళ్ళ స్టీరియో విజన్ సహాయంతో ఊహ తెలియక మునుపే ఎదురుగా ఉన్న వస్తువుల మధ్య ఎంత ఎడం ఉందో క్రమంగా మనకు తెలుస్తుంది. వినికిడి, వాసన, స్పర్శ వగైరాల ద్వారా అందే సమాచారాన్ని కూడా మెదడులోని ఒక్కొక్క భాగమూ ఎలా స్వీకరించాలో, ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్చుకుంటుంది. ఎందుకంటే వస్తుగత యదార్థత ఉండేది వాస్తవ ప్రపంచానికే. ప్రాణులు తమ అవసరాలని బట్టి కావలసిన అవగాహనను పెంపొందించుకుంటాయి. ఆధ్యాత్మిక ధోరణిలో పడ్డవారికి ఇలాంటి విషయాలు తట్టవు కనక గోరంతల్ని కొండంతలుగా ఊహించుకుని ఆందోళన పడుతూ ఉంటారు.
నిజానికి మనిషి తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే చైతన్యం, స్పృహ అనేవి ప్రాథమిక స్థాయిలో మొదలవుతాయి. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇవి ఎక్కువై, వ్యక్తిగత, వస్తుగత యదార్థతలకు తేడా లేకుండా పోతుంది. స్పృహ, చైతన్యం, ఆత్మజ్ఞానం మొదలైనవన్నీ తక్కిన ప్రాణులలాగే చిన్నతనంలో మన మెదడుకూ, పరిసరాలకూ మధ్య నిరంతరం జరిగే ప్రక్రియల ద్వారా క్రమంగా ఏర్పడతాయి. మెదడులోని ఆలోచనలకూ, బాహ్యప్రపంచానికీ ఉన్న తేడాలు అర్థం అవడం మొదలుపెట్టాక మనుషులకు తమ చైతన్యం చాలా ప్రత్యేకమైనదిగా అనిపించనారంభిస్తుంది. మన భావనలూ, ఉద్దేశాలూ, ఆవేశాలూ ఏవీ కూడా మాటలూ, చేతల ద్వారా తప్ప ఇతరులతో పంచుకోలేమని తెలిసినప్పటినుంచీ "అహం", "ఆత్మ" మొదలైనవాటి గురించిన తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. నిప్పు వల్లా, నీటి వల్లా ఇతర వ్యక్తులకూ, జంతువులకూ కూడా మనవంటి స్పందనలే కలుగుతాయనేది తెలిసినా కూడా చాలామందికి తగినంత వివేకం ఏర్పడదు. అందుకనే వ్యక్తిగత భావాల్లో ఉండే తేడాలను గురించి ఉన్నవీ, లేనివీ కల్పించుకుని, తమలో ఏదో ఆత్మ ఉందనీ, అది మరణానంతరం కూడా కొనసాగుతుందనీ ఏవేవో ఊహించుకుంటారు. శిశువులు ఒక దశలో అద్దంలో కనబడే తమ ప్రతిబింబాన్ని చూసి మరెవరో అనుకుంటారు. అలా అతి ప్రాథమిక స్థాయిలో మొదలయే మన అవగాహన "ముదిరి", ప్రకృతి మాయ అనీ, పురుషుడే యదార్థమనేంత దాకా పోతుంది. వాస్తవ ప్రపంచం కన్నా దాన్ని గురించిన అవగాహనే ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ఈ వేదాంత ధోరణికి బీజాలన్నీ మన మెదడులోనే ఉంటాయి. పుట్టుకతో సంక్రమించని "ఆత్మ" అనే భావన చచ్చిపోవడంతోనే పోతుందని చాలామందికి నమ్మబుద్ధి కాదు. మతాలన్నీ ఈ బలహీనతలను ఉపయోగించుకుంటాయి.
ఆత్మ వగైరాల గురించిన నమ్మకాలు యూదులనుంచీ అనేక మతాలవారిలో ఉన్నాయి. హేతువాదం కూడా మొదటినుంచీ ఉన్నదే. మన దేశంలో ఇలాంటి విషయాల్లో సరైన అవగాహన కలిగినవారు చార్వాకుల నాటి నుంచీ ఉన్నారు. బుద్ధుడూ, మహావీరుడూ మొదలైనవారికి సమకాలికుడుగా భావించబడుతున్న అజిత కేశకాంబలి అనే తత్వవేత్త ఒక సందర్భంలో ఇలా అన్నాట్ట. "ఓ రాజా, దానధర్మాలూ, యజ్ఞబలులూ మొదలైనవాటి వల్ల పుణ్యమేమీ కలగదు. సత్కార్యాలో, దుష్కృత్యాలో చేసినంత మాత్రాన నీవనుకున్న ఫలితాలేవీ కలగవు. ఇహ, పరలోక జీవితాలనేవి ఉండవు. తల్లిదండ్రులనేవారు లేకుండా సంతానం కలగదు. ముక్తిని పొందిన ఋషులూ, బ్రాహ్మణులూ ఎవరూ లేరు. ఇహ పరాలనూ సాధించినవారూ, అటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వగలిగినవారూ లేరు. మనుషులందరూ నాలుగు ధాతువులతో రూపొందారనే దొక్కటే సత్యం. చనిపోయాక వారిలోని మట్టి మట్టిలో కలిసిపోతుంది. ద్రవాలన్నీ నీరుగానూ, వేడిమి అగ్నిగానూ మారిపోయి, ఊపిరి గాలిలో కలిసిపోతుంది. వారి చైతన్యమంతా శూన్యం ఐపోతుంది. బతికున్న నలుగురు చచ్చినవాణ్ణి పాడె గట్టి మోసుకెళుతూ, శ్మశానం చేరేదాకా వాణ్ణ్ణి పొగుడుతారు. అక్కడికి చేరాక వాడి ఎముకలు సున్నంలోనూ, వాడిచ్చిన నైవేద్యాలూ, చేసిన పుణ్యకార్యాలూ అన్నీ బూడిదలోనూ కలిసిపోతాయి. బలులూ, నైవేద్యాల గురించి చెప్పేవారు మూఢులు. వాటివల్ల పుణ్యం కలుగుతుందనడం అర్థం లేని మాట. మూఢులూ, జ్ఞానులూ అందరూ కూడా శరీరాలు నశించాక, తక్కినవారితో తెగతెంపులై, నాశనమైపోతారు. బతికున్నప్పటిలాగా ఉండరు".
పంతొమ్మిదో శతాబ్దంలో యూరప్‌లో క్రైస్తవ మత భావనల మూఢ విశ్వాసాలు కొంత బలహీనపడడంతో భౌతికవాదం స్పష్టంగా రూపొందసాగింది. జ్ఞానమైనా, విజ్ఞానమైనా పరిశీలనలూ, నిరూపించగలిగిన పరిశోధనల మీదనే ఆధారపడాలి కాని నిరాధారమైన నమ్మకాల మీద కాదనే ధోరణి పెరిగింది. ఈ నాటి విజ్ఞానం ప్రతి ఆలోచననూ, మనోభావాన్నీ విశ్లేషించి, వాటికి దారితీసే జీవరసాయనిక ప్రక్రియలను వివరించగలిగిన పరిస్థితికి చేరుతోంది. ఈ రకమైన చైతన్యమూ, అవగాహనా నాడీమండలం, సంక్లిష్టమైన మెదడూ ఉన్న మనుషుల వంటి కొన్ని ప్రాణులకే పరిమితం అని తెలుస్తోంది. అవసరాలని బట్టి జీవపరిణామంలోని కొన్ని దశల్లో బుద్ధి వికాసం అనేది కొన్ని ప్రాణులకు "తలవనితలంపుగా" జరిగింది. ఈ పరిణామాలకు గురి అయిన జీవాలకు మనుగడ ఎంత ముఖ్యమో అవగాహనా అంతే ముఖ్యం. ఇది ప్రాణులన్నిటికీ వర్తించదు. బాక్టీరియావంటి జీవాలకు నాడీవ్యవస్థ ఉండదు. ఆలోచనలూ, భావనలూ లేకపోయినా అవన్నీ కొల్లలుగా పెరుగుతూ, ప్రతిచోటా కనిపిస్తాయి. ఎంతో విజయవంతంగా వర్ధిల్లుతున్న ఈ "బుద్ధిలేని" ప్రాణులన్నీ మనకన్నా హీనమైనవి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఏవో అయోమయపు అపోహలతో ఆత్మలనూ, పునర్జన్మనూ నమ్ముతూ ప్రతిపాదనలు చేసేవారికి, కనీసం మనకు కనబడుతున్న జీవాలన్నిటికీ వర్తించే సూత్రాలను అన్వేషించాలనే వివేకం కూడా ఉండదు. అచ్చగా వ్యక్తిగతమైన ఊహలనూ, ప్రేరణలనూ ఆధారం చేసుకుని సృష్టి "రహస్యాల" గురించి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. విజ్ఞానపరంగా ప్రస్తుతం వివరించలేని విషయాలేవైనా దొరకగానే వీళ్ళకు ఆవేశం వచ్చేస్తుంది. ఉదాహరణకు ఇటీవలి దాకా ఆత్మ శరీరం నుంచి వేరయి తమ శరీరాన్ని తామే చూసినవారి అనుభవాలగురించి తర్జన భర్జన జరిగింది. ఔట్ ఆఫ్ బాడీ అనుభవాలనబడే ఈ సంఘటనలను మళ్ళీ పరిశోధించారు. తీరా చూస్తే ఇందులో అతీతశక్తి ఏమీ లేదనీ, మెదడులోని ఒక భాగాన్ని స్పృశించినప్పుడు అటువంటి భావనలు కలుగుతాయనీ వెల్లడయింది.
మనం గుర్తుంచుకోవలసిన దేమిటంటే నిన్న మొన్నటిదాకా అంటురోగాలూ, తుఫానులూ, భూకంపాలూ కలిగినప్పుడల్లా ఏ తోకచుక్కనో చూసి బెదిరిన మానవజాతి మనది. ఆధునిక స్వాములు వీటన్నిటికీ పాత నమ్మకాలను ప్రచారం చేస్తే జనం తాటాకులు కట్టేస్తారు గనక జాగ్రత్తపడి ప్రస్తుతం సందిగ్ధంగా అనిపించే విషయాల గురించే బోధలు చేస్తూ ఉంటారు. బీదవారినీ, దారిద్య్రాన్నీ చూసి చలించిన కొందరు సంపన్నులకు కలిగే భయాందోళనలకూ, వారిని బాధించే అంతరాత్మల క్షోభకూ ఉపశమనం కలగడానికి శ్రీశ్రీరవిశంకర్ వంటి గురువులు వారి కోసం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. సామాజిక అసమానతలవల్లా, నగ్నంగా తాండవం చేస్తున్న దుర్మార్గపు వ్యవస్థ కారణంగానూ తలెత్తే సమస్యలన్నిటికీ ఈ బోధకులు ఆధ్యాత్మిక పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు. కేవలం ఆర్థిక శక్తులవల్ల కలిగే కుటుంబ సంక్షోభాన్నీ, వ్యక్తిగత వైరుధ్యాలనూ గుర్తించలేనివారంతా ఈ రకమైన షార్ట్‌కట్ పద్ధతులను అన్వేషిస్తూ ఉంటారు. మన సనాతనులు ఆత్మలూ వగైరాల గురించి చెప్పినవాటిలో వీరికి కొంత నిజం కనిపిస్తూ ఉంటుంది.
మైక్రోస్కోప్ కనిపెట్టినదాకా సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియనుకూడా తెలియదు కనక ప్రాచీనులకు జీవకోటిలోని వైవిధ్యం గురించి ఇంతగా అవగాహన లేదు. ప్రతి జీవానికీ ఆత్మనూ, పునర్జన్మనూ ఆపాదిస్తూపోతే ఎంత అయోమయంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. క్రీస్తుకు అయిదువందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జన్మరాహిత్యం గురించి ఊహించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అలా ఎవరైనా ఆలోచిస్తే అది బుద్ధిరాహిత్యమే! ఇప్పటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో వెనక్కు వెళ్ళి తెలుసుకోవడం ఈ వ్యాసాల ఉద్దేశం. ఉదాహరణకు మనిషికి మెదడే ప్రత్యేకం. ఇది ఎలా రూపుదిద్దుకుందో తెలియాలంటే ఇతర వానరాల, క్షీరదాల, జంతువుల గురించీ వాటి పరిణామం జరిగిన పద్ధతి గురించీ తెలుసుకోవాలి. ఇంకా వెనక్కు వెళ్ళి, మొదటి జలచరాలూ, బహుకణ ఏకకణ జీవులూ ఎలా పుట్టాయో అన్వేషించాలి. చివరకు భూమీ, సూర్యుడూ, నక్షత్రాలూ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. మనకు తెలిసిన భౌతిక సూత్రాలేవీ అతిక్రమణకు లోనవకుండా జరిగిన ఈ పరిణామదశలన్నీ చూసినప్పుడు ఈ విశ్వం గురించిన "ఉద్దేశం" ఏదీ లేదనీ, ఇది ఎవరి "లీలా" కాదనీ అనిపించకమానదు. "పచ్చి" భౌతికవాదానికి తగిన ప్రత్యామ్నాయం లభించేదాకా హేతువాదులకు అది తప్ప మరో దారిలేదు. మన కళ్ళకు కనబడే ప్రపంచమూ, సంఘటనలే మనకు యదార్థం. మన శరీరానికి ఏ రాయో తగిలితే కలిగే బాధ వల్ల రాయి యదార్థత మరింత బాగాతెలుస్తుంది కూడా. స్పర్శ ద్వారానో, గాయంవల్లనో రాయి గురించి మనకు కలిగే అవగాహనతో రాతికి సంబంధమేమీ లేదు. చైతన్యం (కాన్షస్‌నెస్) ఉన్న ప్రాణులన్నిటికీ ఈ వ్యక్తిగతమైన (సబ్జెక్టివ్) అవగాహన ఉంటుంది. వస్తుపరమైన యథార్థత (ఆబ్జెక్టివ్ రియాలిటీ) అనేదానికీ, మన చైతన్యానికీ సంబంధం లేదని లెనిన్ అన్నాడు. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్ వంటి మేధావులు కూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
పదార్థమూ, జీవపదార్థమూ ఎలా పరిణామం చెందాయో తెలుసుకుంటే ప్రాణులకు ఈ చైతన్యం ఎలా కలిగిందో అర్థమవుతుంది. మెదడూ, నాడీమండలమూ విపరీతంగా అభివృద్ధి చెందిన మనిషిిజాతికి ఈ అవగాహన అత్యున్నతస్థాయిలో ఉంటుంది. మన దేశపు వేదాంత ధోరణి అతిగా తలకు పట్టించుకుంటే మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ కొందరికి అనిపిస్తుంది.
ఎంతటి మిథ్యావాదులైనా మెదడు కూడా విశ్వంలోని పదార్థరాశిలో ఒక భాగమేనని ఒప్పుకుంటారు. మనసు, లేదా బుద్ధి అనేదానికి మెదడుతో సంబంధం లేదనే ఒక ప్రతిపాదన ఉంది. దీనికి ఇంతవరకూ సరైన రుజువేదీ దొరకలేదు. మెదడుకు "వెలపల" రూపొందిన భావనలేవీ కనబడవు. మెదడు గురించి నిరంతరంగా సాగుతున్న పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన నిజాలు బైటపడుతున్నాయి. మెదడులోని కోటానుకోట్ల నాడీకేంద్రాల మధ్య ప్రసారమయే ఎలక్ట్రిక్ సందేశాలూ, మెదడులో తాత్కాలికంగా విడుదల అయే రసాయనిక పదార్థాలూ రకరకాల భావనలు కలగజేస్తాయని తెలుస్తోంది. ఇదంతా సరిగ్గా అర్థం అయేలోపలే తొందరపడి పెద్ద ప్రతిపాదనలు చెయ్యడంవల్ల ఉపయోగం ఉండకపోగా మరింత అయోమయం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదనకు ఆధారాలన్నీ వ్యక్తిపరమైన భావనలే.
మెదడూ, కొన్ని రకాల ప్రాణులకు ఉన్న నాడీమండలమూ ఎప్పుడు, ఎటువంటి పరిస్థితుల్లో రూపొందాయో విజ్ఞానం చెపుతుంది. ఈ సందర్భంలో 450కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూమి మీద మనుషులు పుట్టి 20 లక్షల సంవత్సరాలే అయిందని గుర్తుంచుకోవాలి. అంటే మనిషికి తన మెదడు ద్వారా లభిస్తున్న స్పృహ ఏర్పడని కోట్లాది సంవత్సరాల క్రితం నుంచీ పదార్థం (మేటర్) అనేది ఉంటూనే ఉంది. మనిషి మెదడులోని కణజాలం ఆలోచనకూ, జ్ఞాపకశక్తికీ, వివేచనకూ తోడ్పడుతుంది కాని అది కూడా పదార్థంతో రూపొందినదే. నిర్జీవపదార్థానికి వర్తించే భౌతికసూత్రాలన్నీ దానికీ వర్తిస్తాయి. విశ్వంలోజరుగుతున్న సంఘటనలను గమనిస్తే పదార్థం గురించిన అవగాహనకన్నా పదార్థమే ప్రాథకమికమైనదీ, మౌలికమైనదీ అని తెలుస్తుంది.
నిజమైన ఆధునిక సంస్కృతి, లేక కల్చర్ భౌతికశాస్త్రంవల్లనే కలుగుతుందని రిచర్డ్ ఫేన్‌మన్ అన్నాడు. ఈనాటికీ ప్రపంచంలోని మతాలన్నీ ఆటవికలక్షణాలతో నృత్యం చెయ్యడం చూస్తూంటే అది నిజమనిపించకమానదు. మూఢనమ్మకాలూ, వికృతమైన ఆచారాలూ, నిరూపించనవసరంలేని ప్రతిపాదనలూ ఈ మతాలకు ఆధారాలు. ఒకవంక సమాజాన్ని దోపిడీచేస్తూ దానికి గురి అయినవారి బలహీనతలని ఉపయోగించుకుంటూ అందుకు కారణాలని "పర"లోకంలోచూపించే మతప్రచారకులు ఎలాంటివారో మామూలుగా అందరికీ తెలియదు. రకరకాల జంతువుల తలల దేవుళ్ళతో కొన్ని మతాలూ, సంగీతమూ, కార్టూన్లూ తమకు విరుద్ధమనే మతాలూ, కష్టాలతో ప్రాణంమీదికొచ్చినవారిని దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమతో కాపాడతాడనే మతాలూ ఇలా ఎవరిదారినవారు ప్రజలని శాయశక్తులా భ్రమపెడుతూ ఉంటారు. ఇంతకన్నా"ఆధునిక" పద్ధతిలో అయోమయం సృష్టించే తత్వవేత్తలూ ఉన్నారు.
మతాల ప్రచారాన్నీ, ఆధ్యాత్మికవాదులనీ పక్కన పెడితే నిజమైన జీవపరిణామం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీతో ప్రయత్నించవచ్చు. శాస్త్రపరిశోధనలు ఈ పద్ధతిలోనే జరుగుతూ వస్తున్నాయి. శాస్త్రీయంగా ఈ నాడు నిరూపితమైన సిద్ధాంతాలకి అడ్డుతగిలే ఫలితాలు ఎదురైనప్పుడల్లా ఆ సిద్ధాంతాలని మార్చుకోక తప్పదు. ఇందులో ప్రవచనాలని గుడ్డిగా నమ్మే ప్రసక్తి ఉండదు. ఐన్‌ష్టయిన్ అంతటివాడే మొదట్లో క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలని ఆమోదించలేదు. ప్రస్తుతం విజ్ఞానం పదార్థాన్నీ, వికిరణాలనీ (రేడియేషన్) విశ్లేషణ ద్వారా అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. విద్యుత్తుగల కణాలని పార్టిక్‌ల్ ఆక్సిలేటర్లలో పరిగెత్తించి ఒకదాని కొకటి ఢీకొనేట్టు చేసి విశ్వం ఆవిర్భావానికి దారితీసిన బిగ్ బేంగ్ పెద్ద పేలుడు పరిస్థితులను కృత్రిమంగా సృష్టిస్తున్నారు. ఆ విధంగా విడుదల అయిన విపరీతమైన శక్తివల్ల అతి తక్కువ జీవితకాలం కలిగిన కొన్ని సూక్ష్మకణాలు ఎలా ఉత్పత్తి అవుతాయో గమనించడం వీలవుతుంది. ఇప్పుడు కనబడుతున్న విశ్వాంతరాళంలోని పదార్థరాశికి ఇటువంటి లక్షణాలు ఎలా కలిగాయో ఈ పరిశోధనలవల్ల తెలిసే అవకాశముంది. బరువూ, విద్యుత్తూ కూడా లేని న్యూట్రినో కణాలూ, కంటికి కనబడని డార్క్ మేటర్ అనబడే "అదృశ్య" పదార్థరాశీ వగైరాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా "ఎందుకు" జరిగిందనేది పట్టించుకోకుండా "ఎలా" జరిగిందని పరిశోధిస్తున్నారు.
గట్టిగా ప్రయత్నిస్తే తప్ప కనబడని సంఘటనలు అంతరిక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి. మహా ఉత్పాతం కలిగిస్తూ పేలిపోయే నక్షత్రాలూ, వాటినుంచి ప్రసారం అయే అతి తీక్షణమైన కిరణాలూ, ఎక్కణ్ణించి వస్తున్నాయో అంతుచిక్కని గామా, ఎక్స్ రేల ప్రసరణమూ, ఊహించరానంత దూరాన ఉండి, అతివేగంగా బొంగరాల్లా తిరిగే క్వేజార్లూ, పల్సార్లూ ఇలా వింతలెన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి తీవ్రతతో పోలిస్తే మనం వీటిని గమనిస్తున్నామో లేదో అనే విషయం ఏ మాత్రమూ అర్థంలేనిదిగా అనిపిస్తుంది. గమనికకు గురి అవుతున్న ఇవన్నీ ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుంటూ, గమనించడం అనే శక్తి మనకు అసలు ఎలా అబ్బిందో కూడా తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు. దీనివల్ల మనకున్న అపోహలు చాలామటుకు తగ్గే అవకాశం కూడా ఉంది. మనిషి తన జీవితంలో రకరకాల భావాలకు లోనవుతాడు. వీటిలో ప్రేమ, జాలి, కోపం, దుఖం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి కాక కొన్ని సందర్భాల్లో దైవభక్తి, దివ్యానుభూతులు, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం వంటి భావనలు కూడా కలుగుతాయి. వీటికి జాతి, మత, ప్రాంతీయ పరిమితులేవీ ఉన్నట్టు కనబడవు. వ్యవస్థీకృతమైన పెద్ద మతాలే కాదు, ఆదిమజాతి తెగలకు చెంది గ్రామదేవతలు వగైరాలను ఆరాధించేవారికి కూడా నిజంగా ఇలాంటి భావనలు కలుగుతాయనేది తెలిసిన విషయమే. భావాలన్నిటికీ కేంద్రం మెదడే అని భౌతికవాదుల నమ్మకం. ఇతర ఉద్రేకాలకు లోనయినప్పుడు మనిషి మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్న శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక భావనలు కలిగించే ప్రభావాన్ని కూడా పరిశీలించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ఇలాటి భావనలకు కొన్ని లక్షణాలు సామాన్యం. వీటికి లోనయినవారికి కలిగే అనుభూతుల్లో ఒకరకమైన పరిపూర్ణత్వం సాధించినట్టనిపించడం, మైమరచిపోవడం, విశ్వంతో ఏకమైనట్టు అనిపించడం, అనిర్వచనీయమైన మనశ్శాంతి, అన్నిరకాల భయాలనుంచి విముక్తి పొందిన భావన, అలౌకికానందం, భగవత్స్వరూపాన్ని దర్శించడం వగైరాలుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మెదడులో ఎటువంటి మార్పులు కలుగుతాయో కనిపెట్టడానికి ధ్యానంలో మునిగిన కొందరు బౌద్ధ భిక్షువులపై ప్రయోగాలు చేశారు. వారి మెదడులో నిద్రాణమైన భాగాలు మేలుకున్నట్టూ, పనిచేస్తున్న కేంద్రాలు సుప్తావస్థకు చేరుకున్నట్టూ తెలియవచ్చింది. ఈ ప్రయోగాల ఉద్దేశం దేవుడున్నాడా లేడా అన్నది నిరూపించడం కాదు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న మెదడు పనిచేసే పద్ధతిలో కలిగే మార్పులను పసిగట్టడమే.
దీనికి కారణం ఉంది. మతపరమైన చర్యల్లో ఊహలు ఒక భాగం మాత్రమే. మతాల ఆచరణలో పూజలూ, పునస్కారాలూ, తంతులూ, నైతిక ఆచరణా, సత్కార్యాలు చెయ్యడమూ, ఇతరులపట్లా , సమాజం పట్లా ధార్మిక సద్వర్తనా ఇలా అనేకం ఉంటాయి. ఎటొచ్చీమతవిశ్వాసాలకు బలమైన పునాది ఆలోచనల, భావాలవల్లనే కలుగుతుంది కనక వాటికి గల శారీరిక లక్షణాలను గురించి చర్చించడమే ప్రస్తుత ఉద్దేశం.
ఈ ప్రయోగాలకు గురి అయినవారి మెదడులోని రక్తప్రవాహంలో స్వల్ప మోతాదులో రేడియో ధార్మిక పదార్థాన్ని ప్రవేశపెట్టి దాని ఆచూకీని బైటినుంచి డిటెక్టర్ల ద్వారా కనిపెట్టడం జరిగింది. దీనివల్ల మెదడును "చిత్రీకరించడం" సాధ్యమైంది. ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మెదడు ముందు భాగంలోని ప్రక్రియలు వేగవంతం అయాయి. ఏదైనా పనిమీద మనసుపెట్టినప్పుడు జరిగేదిదే. అదే సమయంలో మెదడుకు పైభాగంలోనూ, వెనకా ఉండే పార్శ్విక, లేదా బహిస్థ (పెరైటల్) భాగంలోనూ చర్యలు తగ్గాయి. పరిసరాలను గమనించలేని స్థితిలో ఇదే జరుగుతుంది. ధ్యానంలో నిమగ్నులైనవారికి తమను తాము మరచిపోయినట్టూ, పరిసరాలకూ, స్థలకాలాలకూ అతీతులైనట్టూ అనిపించడానికి కారణం ఇదే. ఈ మార్పులు అనేక పరిశోధనల్లో బైటపడ్డాయి గనక ఆధ్యాత్మిక భావనలకు ముఖ్యకారణాలు ఇవేనని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.
మెదడులో కొన్ని భాగాలకు చైతన్యం కలిగి, చైతన్యవంతమైన కేంద్రాలు నిద్రాణస్థితికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక స్థితిలో అనుభవించిన యదార్థభావన మెలకువగా ఉన్నప్పుడు అనుభవంలోకి వచ్చే యదార్థత కన్నాగాఢమైనదిగా అనిపిస్తుంది. ఇది చాలా బలమైన ప్రభావం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. దైవ ప్రార్థనలవల్ల రోగాలకు ఉపశమనం కలగడమూ, హిప్నోసిస్ ద్వారా చికిత్స జరగడమూ వగైరాలన్నీ మెదడులో కలిగే మార్పులతోనూ, పై అంశాలతోనూ ముడిపడినవే. అందుచేత నాస్తికులు దేవుడు లేడని ఒక్కమాటలో కొట్టిపారేస్తున్నపుడు ఆస్తికులకు తమ ప్రగాఢ విశ్వాసానికి అవమానం జరిగిందని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
పరిశోధనలకు లోనయిన బౌద్ధ భిక్షువులు ధ్యానం చేస్తున్నప్పుడు వారి మెదడులో నిజంగానే ఆనందాన్నీ, ఆందోళనకు దూరం కావడాన్నీ, ప్రశాంతతనూ ప్రతిఫలించే మార్పులు కలిగాయని రుజువైంది. ఆధ్యాత్మిక భావాలు లేని మనుషులకు కృత్రిమంగా ఇటువంటి మనస్థితి కలిగిస్తే వారు సరిగ్గా ఇటువంటి భావనలకే లోనవుతారా అని తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వారిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న గదిలో కూర్చోబెట్టి వారి తలలను అయస్కాంతక్షేత్ర ప్రభావానికి గురిచేశారు. ఆ స్థితిలో వారి మెదడులో కలిగే మార్పులు ఆధ్యాత్మిక భావాలను పోలినవా కాదా అని పరిశీలిస్తున్నారు.
సైన్స్‌పరంగా చూస్తే మెదడు విద్యుత్‌రసాయనాలతో (ఎలెక్ట్రో కెమికల్స్) పనిచేసే శరీరభాగం. అందుచేత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు అందులో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో తెలుసుకోవడం శాస్త్రవేత్తల కర్తవ్యం. ఎపిలెప్సీవంటి కొన్ని రకాల మూర్ఛరోగాలవల్లనూ, కొన్ని మాదకద్రవ్యాలవల్లనూ కూడా మతపరమైన భ్రమలు కలుగుతాయని డాక్టర్లకు తెలుసు. మన దేశంలో కొందరు సాధువులూ, బాబాలూ భంగువంటి మత్తు పదార్థాలు సేవిస్తారనేది తెలిసినదే.
దేవుడి గురించిన భావనలకు సాంస్కృతిక, సమాజపరమైన కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతి యుగంలోనూ వివిధ జాతుల, ప్రాంతాలవారికి నిజంగానే ఒకే రకమైన ఆధ్యాత్మిక భావనలు కలుగుతూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇదంతా ఏదో కుట్ర అనీ, అబద్ధాలనీ అనుకోవడం కూడా సబబు కాదు. దీనికిగల భౌతిక కారణాలు మెదడు నిర్మాణంలోనే ఉన్నట్టు కనబడుతోంది. కొందరు శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిణామదశలో మనిషి మెదడులో దేవుణ్ణి నమ్మే లక్షణాలు బలంగా ఉన్నాయనీ, ఇప్పట్లో అందులో మార్పు కలిగే పరిస్థితి లేదనీ అంటున్నారు. అంటే దీనర్థం జ్ఞానోదయం కలిగినప్పుడు గౌతమ బుద్ధుడి మెదడుయొక్క పై భాగం సద్దుమణిగిందనా? మోజెస్, మహమ్మద్ ప్రవక్త తదితరులకు వినిపించిన అశరీరవాణి చిత్త భ్రమేనా? యేసుక్రీస్తు దేవుడితో సంభాషించడం మెదడులో కలిగిన గందరగోళమేనా? దేవుడు మనిషిని సృష్టించాడని నమ్మేవారు మాత్రం దేవుడి గురించిన భావన కేవలం మనిషి మెదడు సృష్టించినదే అంటే ఆగ్రహం చెందుతారు. ఈ చర్చకు స్పష్టమైన వివరణ ఏదీ ఇంకా లభించలేదు కనక మతవిశ్వాసాలు కొందరికి మనశ్శాంతినీ, కొన్ని పరిస్థితుల్లో రుగ్మతల నివారణకూ కూడా ఎలా పనికొస్తున్నాయో, అందుకు దారితీసే ప్రక్రియలు మెదడులో ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి.