Saturday, June 09, 2007

మరికొన్ని వ్యాసాలు
నెలల పేర్లు
(పిల్లల కోసం)
చరిత్ర అంతా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల చిట్టాలాగా అనిపిస్తుంది. కాని జరిగిన విషయాల పూర్వాపరాలను సకారణంగా వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషించవచ్చు...

చాలా ఏళ్ళ క్రితం “చందమామ”లో రక్షరేకు అనే ఒక కథ చదివాను. అందులో ఒక కుర్రవాడు పిరికివాడని గ్రహించిన సహవిద్యార్థులు వాణ్ణి ఎప్పుడూ కొట్టి ఏడిపిస్తూ ఉంటారు. రోజూ ఏడుస్తూ ఇంటికొచ్చే కొడుకుకు సాహసం నూరిపొయ్యటానికని వాడి తల్లి తమ వంశపు శౌర్యప్రతాపాలను గురించి గుర్తుచేసి వాడి చేతికొక తాతలనాటి రక్షరేకు కడుతుంది. దాన్ని ధరించినంతకాలమూ తననెవరూ ఓడించలేరని నమ్మిన కుర్రవాడు అకస్మాత్తుగా సాహసవంతుడైపోయి అందరినీ చితకబాదెయ్యగలుగుతాడు. నిజానికి ఆ రక్షరేకులో మహత్తు ఏమీ లేదనీ, ధైర్యమనేది మనలో పుట్టుకురావాలనీ కుర్రవాడు చాలా రోజుల తరవాత గ్రహిస్తాడు. ఈ కథవల్ల రక్షరేకులవంటివి బూటకమని మనకు తెలుస్తుంది. అయినా వాటివల్ల కలిగే మంచిని నిరాకరించడం ఒక్కొక్కప్పుడు కష్టం. పై కథలో జరిగినదంతా కూడా మన మనసుల్లో ఉత్పన్నమైన భావాల ఫలితమే. విజ్ఞులైనవారికి ఎటువంటి “రక్షరేకుల” అవసరమూ లేదని నా ఉద్దేశం. తమను తాము మభ్యపెట్టుకోవటానికో, ఇతరులను మభ్యపెట్టటానికో ఇలాంటివి పనికొస్తాయి కాని వాటిలో అతీంద్రియశక్తులేవీ లేవని మాత్రం గుర్తుంచుకోవాలి.

ఈ నాడు ప్రపంచంలోనూ, విశ్వంలోనూ మన స్థాయి ఎటువంటిదో అందరికీ తెలుసు. రకరకాల జీవాలతో లుకలుకలాడే భూమి మీద మనంకూడా అన్నిటితోనూ సహజీవనం చేస్తున్నాం. ఎటొచ్చీ మనుషులకున్న భావనాపటిమ దృష్య్టా తక్కిన ఏ ప్రాణికీ లేని శక్తులు మనకున్నాయి. పంటలను నాశనం చెయ్య ప్రయత్నించే పక్షుల్లాగా మనం దిష్టిబొమ్మలను చూసి బెదరం. నిజమేమిటో, కనుకట్టేమిటో పసికట్టగలం. సైన్సూ, టెక్నాలజీ ఊహించలేనంత స్థాయికి ఎదుగుతున్నాయి. అయినప్పటికీ చాలామందికి వాస్తవప్రపంచాన్ని గురించిన సరైన అవగాహన ఉన్నట్టుగా కనబడదు. మతాల పేరుతోనో, సంప్రదాయాల పేరుతోనో మధ్యయుగంలో జీవిస్తున్నవారే ఎక్కువ. ఎవరి నమ్మకాలు వారివి అని మర్యాదగా ఒప్పుకుంటాం కాని ప్రతి బుడబుక్కలవాడికీ దైవికశక్తులున్నాయని నమ్మేవారిని చూసి చాటుగా నవ్వుకోవడమూ కద్దు. ఈ నమ్మకాల్లో కొన్ని గుడ్డివనీ, తక్కినవి కొన్ని మాత్రం వివరించరాని, అతీంద్రియ శక్తులకు సంబంధించినవనీ అనుకునేవారున్నారు. నా లెక్కన అన్నీ ఒకటే. అంతకన్నా ఇబ్బంది కలిగించే విషయమేమిటంటే వాటి గురించిన ప్రత్యేక జ్ఞానమేదో తమకుందని చెప్పుకునేవారికీ లోటులేదు. వివరించలేని సమస్యలు లేవనికాదు. ఈనాటి మిస్టరీయే రేపటి సైన్సు అవుతుంది. ప్రస్తుతం అర్థం కాని విషయాలను గురించి పరిశోధించవలసి ఉందని చెప్పటానికి నిజమైన శాస్త్రవేత్తలెవరూ సంకోచించరు. అన్నీ తమకే తెలిసినట్టు జ్ఞానోపదేశాలు చేసేవారే ప్రమాదకరంగా అనిపిస్తారు. వారిలో చాలామందికి సైన్స్‌ రంగంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో కూడా తెలియదు.

అటువంటి భేషజాలకు పోకుండా ఆధునిక పరిశోధనలద్వారా బైట పడుతున్నవీ, అందరూ తెలుసుకోదగినవీ అనిపించిన కొన్ని విషయాలను ఈ వ్యాసాల్లో చర్చించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా మన జీవితాలను బలంగా తీర్చి దిద్దే ఆలోచనా ప్రపంచం గురించీ, మెదడును గురించీ గత పది, పదిహేనేళ్ళుగా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. నేను శరీరశాస్త్రం వగైరాలేవీ చదువుకోలేదు. నా ఆసక్తి కొద్దీ సేకరించిన వివరాలను పాఠకులతో పంచుకుందామనే ప్రయత్నించాను. మరొకటేమిటంటే ప్రత్యేకంగా ఏ సంస్కృతినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ప్రస్తుత కాలంలో హేతువాద, భౌతికవాద దృక్పథం మనకు అత్యవసరమైనదని నా ఉద్దేశం. దీనితో అందరూ ఏకీభవించకపోవచ్చునని నాకు తెలుసు.

ఇంటర్నెట్‌లో సాహిత్య పత్రికలను దేశ విదేశాల్లో విద్యాధికులందరూ చదువుతారు. వివేచనా, అవగాహనా వారికే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాసాల్లోని విషయాలు అటువంటివారిని ఉద్దేశించి రాసినవే. మన సాహిత్యంలో సామాజిక సమస్యలను స్పృశించని రచన అంటూ ఉండదు. వీటిలో ఊహలకు సంబంధించిన సమస్యలు కూడా కలగలిసి ఉంటాయి. వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే ఉంది. అందుచేత ఇటువంటి వ్యాసాలకు సాహిత్య పత్రికల్లో కాస్తంత చోటు లభించాలనే నా ఉద్దేశం.
వ్యాసాల కోసం: